తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న సీఎం

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేదార్‌నాథ్‌ ఆలయం.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 10:50 AM IST
kedarnath temple, open,  devotees ,

 తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం.. తొలి పూజలో పాల్గొన్న సీఎం 

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేదార్‌నాథ్‌ ఆలయం. ఈ టెంపుల్‌ తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. ఆలయం తెరుచుకున్న సందర్భంగా కేదార్‌ నగరి జైకేదార్‌ అనే నినాదాలతో మార్మోగింది. ఇవాళ అక్షయ తృతీయ పర్వదినం కావడంతో భక్తులు కేదార్‌నాథ్‌ స్వామి దర్శనం కోసం పెద్దఎత్తున తరలి వెళ్లారు. ఆలయ ప్రాంగణం మొత్తం శివనామ స్మరణతో నిండిపోయింది. ఆలయం తలుపులు తెరుచుకున్న సందర్భంగా హెలికాప్టర్‌ పైనుంచి పూల వర్షం కురిపించింది. కాగా.. నిన్న సాయంత్రం వరకు కేదార్‌నాథ్‌ దర్శనం కోసం 16వేలకు పైగా మంది భక్తులు అక్కడికి చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకున్న తర్వాత.. తొలి పూజలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేదార్‌నాథ్‌ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా.. సీఎం కుటుంబ సభ్యులతో కలిసి కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్‌నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు వచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. అయితే.. శీతాకాలంలో కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసివేస్తారు. ఆరు నెలల పాటు మూసి ఉన్న ఆలయ తలుపులను భక్తుల సందర్శనార్థం ఇవాళే తెరిచారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని అధికారులు పూలతో సర్వాంగ సుందరంగా అలకరించారు. 40 క్వింటాళ్ల పూలను వినియోగించారని తెలుస్తోంది. ఇక భక్తులు ఉదయం నుంచే కేదార్‌నాథ్‌కు క్యూ కట్టారు. పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.


Next Story