ఇండియా కూటమి నుంచి బంపరాఫర్ వచ్చింది: జేడీయూ
ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 8 Jun 2024 4:24 PM ISTఇండియా కూటమి నుంచి బంపరాఫర్ వచ్చింది: జేడీయూ
ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. బీజేపీ.. కాంగ్రెస్‌కు విడిగా మెజార్టీ రాలేదు. ఇక బీజేపీ మాత్రం మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఎన్డీఏ కూటమి పక్షాల స్థానాలు మేజిక్ ఫిగర్ 272 సీట్లు దాటి.. 292 స్థానాలుగా ఉంది. అయితే.. ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీడీపీ, జేడీయూలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీల అధ్యక్షులకు ఇండియా కూటమి నుంచి కూడా పలు ఆఫర్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా జేడీయూ సీనియర్ నేత ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయం బయపెట్టారు.
జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పారు జేడీయూ నేత కేసీ త్యాగి. నితీశ్ కుమార్‌కు ప్రధానిగా బాధ్యతుల తీసుకునేందుకు ఆఫర్ వచ్చినా.. ఆయన తీసుకోలేదని అన్నారు. ఆ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారని కేసీ త్యాగి చెప్పారు. తాము ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నామనీ.. ఇప్పుడు వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో తాము ముఖ్యపాత్ర పోషించబోతున్నామని జేడీయూ నేత కేసీ త్యాగి అన్నారు.
ఇండియా కూటమికి కూడా ఈ ఎన్నికల్లో 234 స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్డీఏలోని మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, టీడీపీలతో కలవాలని.. బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీయూ చీఫ్‌కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందన్న కేసీ త్యాగి కామెంట్స్ సంచలనంగా మారాయి.