Bigg Boss: షో మధ్యలోనే కంటెస్టెంట్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

కన్నడ బిగ్‌బాస్ షోలో ఓ కంటెస్టెంట్‌ను పోలీసులు అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  23 Oct 2023 3:30 PM IST
kannada, bigg boss, contestant arrested,  house,

Bigg Boss: షో మధ్యలోనే కంటెస్టెంట్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

'బిగ్‌ బాస్‌' రియాలిటీ షో తెలుగుతో పాటు దక్షిణాదిలో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ‘బిగ్ బాస్’ షోలో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, సామాన్యులు పాల్గొంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు కూడా ‘బిగ్ బాస్’లో ఛాన్స్ వస్తోంది. అయితే.. బిగ్‌బాస్‌ షో నుంచి కంటెస్టెంట్స్ వారిని ఒకరు.. లేదంటే ఇద్దరు వెళ్లిపోవడం చూశాం. కొన్నిసార్లు హెల్త్‌ ఎమర్జెన్సీ అని కూడా వెళ్లిపోతుంటారు. కానీ.. కన్నడ బిగ్‌బాస్ షోలో ఓ కంటెస్టెంట్‌ను పోలీసులు అక్కడికి వెళ్లి మరీ అరెస్ట్‌ చేశారు.

కన్నడ ‘బిగ్ బాస్’ సీజన్ 10 కొనసాగుతోంది. ఇందులో పాల్గొన్న వర్థుర్ సంతోష్‌ను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా అతడి పులి గోళ్లను సేకరించడం, వాటిని విక్రయించడం తదితర నేరాలకు గాను అధికారులు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌ బిగ్‌బాస్‌ షో నడుస్తున్నన్ని రోజులు పులిగోరును ధరించే ఉన్నాడు. ఆ పులిగోరే అతడి కొంప ముంచింది. షో చూసిన అధికారులు సంతోష్‌పై కేసు నమోదు చేయడమే కాదు.. నేరుగా బిగ్‌బాస్‌ షోలోకి వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. దాంతో.. ఈ అరెస్ట్‌ సంఘటన కన్నడనాట సంచలనంగా మారింది.

అక్టోబర్‌ 22న కన్నడ బిగ్‌బాబస్‌ హౌజ్‌కు చేరుకున్నారు ఫారెస్ట్‌ అధికారులు. సంతోష్‌పై కేసు నమోదు అయ్యిందని.. అతన్ని అప్పగించాలని నిర్వాహకులకు చెప్పారు. దాంతో.. సంతోష్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి అనూహ్యంగా బయటకు రావాల్సి వచ్చింది. ఇక విచారణలో సంతోష్‌ వేసుకున్నది నిజమైన పులిగోరు అని తేలింది. ఆ తర్వాత కొన్ని ప్రోసీజర్స్‌ పూర్తయ్యాక ఫారెస్ట్‌ అధికారులు సంతోష్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. విచారణలో సంతోష్‌ సహకరించారని.. పులి గోరు అని ఒప్పుకున్నారని చెప్పారు. మూడేళ్ల కిందటే హోసూర్‌లో దాన్ని కొన్నట్లు చెప్పాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారి ఒకరు తెలిపారు.

Next Story