జార్ఖండ్‌లో విషాదం, ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి
జార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుని కాపాడేందుకు ప్రయత్నించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
By - Srikanth Gundamalla |
జార్ఖండ్‌లో విషాదం, ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి
జార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. బావిలో ప్రమాదవశాత్తు ఎద్దు పడిపోయింది. దాన్ని కాపాడేందుకు స్థానికంగా ఉన్న నలుగు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో పైకి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో కొంత భాగం కూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరిని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు.
రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో సిల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది, మురి ఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలోని బావిలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దాంతో.. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు అక్కడికి వెళ్లారు. బావిలో అరుస్తూ కొట్టుమిట్టాడుతున్న ఎద్దుని కాపాడేందుక నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో ఎద్దుని పైకి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో కొంత భాగం కుప్పకూలింది. దాంతో మట్టిపెళ్లలు కూలిపోయాయి. పైన ఉన్న మరోముగ్గురు బావిలో పడిపోయారు. మొత్తం ఏడుగురు బావిలో ఉండగా.. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరిని స్థానిక ప్రజలు శ్రమించి క్షేమంగా కాపాడగలిగారు.
స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బావిలో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం బయటకు తీయగా.. మరో నాలుగు మృతదేహాల కోసం సహాయక చర్యలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే.. 40 అడుగుల లోతులో కూరుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. కాగా.. ఈ విషాద సంఘటపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.