మోదీ ముందుకు జేడీయూ మరో డిమాండ్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి స్పష్టమైన మెజార్టీ రాలేదు.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 3:00 PM ISTమోదీ ముందుకు జేడీయూ మరో డిమాండ్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దాంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం మిత్రపక్షాల సహాయం తీసుకుంటోంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ పార్టీలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. దాంతో.. వారు అడిగిన వాటిని బీజేపీ ఇవ్వక తప్పదు. ఈ నేపథ్యంలో జేడీయూ నేతలు పలు డిమాండ్లను బీజేపీ అధిష్టానం ముందు ఉంచుతున్నారు. ఇప్పటికే బీహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది. తాజాగా జేడీయూ ఎంపీ మరో డిమాండ్‌ను బీజేపీ ముందు ఉంచారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. తాము ఎన్డీయేలోనే ఉంటామని చెబుతూనే.. జేడీయూ ఒక్కో డిమాండ్‌ను మోదీ ముందు ఉంచుతున్నారు. జేడీయూ ఎంపీ మనోజ్ కుమార్ ఝా కులగణనపై మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నితీశ్ కుమార్ తో పాటు పలువురు స్థానిక పార్టీ నాయకులే కింగ్ మేకర్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. బీహార్ ప్రజలు జేడీయూ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారనీ.. వారి ఆశలనె నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని మనోజ్ కుమార్ ఝా అన్నారు. కులగణనతో పాటు.. బీహార్‌కు ప్రత్యేక హోదా అంశంపైనా నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని మనోజ్ ఝా కోరారు.