ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ లైంగికదాడి.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
జేడీఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు ఒక యువకుడు ఫిర్యాదు చేశాడు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 7:57 AM IST
ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ లైంగికదాడి..పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
కర్ణాటకలో హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరో విషయం కలకలం రేపుతోంది. హసనలో మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆయన కుటుంబం చుట్టే తిరుగుతుండటం చర్చనీయాంశం అవుతోంది. జేడీఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ యువకుడు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
లైంగిక దాడులను తాను ప్రతిఘటిస్తున్నాందుకు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని జేడీఎస్ కార్యకర్త ఒకరు డీజీపీ, హసన ఎస్పీ సహా ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశాడు. మొత్తం 15 పేజీల లేఖ రాసిన బాధితుడు తనపై జరుగుతున్న లైంగికదాడితో పాటు పలు విషయాలను వెల్లడించాడు. సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి రేవణ్ణ పెద్ద కుమారుడు సూరజ్ రేవణ్ణ కావడం గమనార్హం.
తనకు ఉద్యోగం ఇస్తానని, ఆర్థికంగా అండగా ఉంటానని నమ్మించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత తనని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చాడు. బాధిత యువకుడికి పోలీసులు అన్ని వైద్య పరీక్షలు చేశారు. అతని శరీరంపై గాయలును గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తనపై యువకుడు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ సన్నిహితులు ఖండించారు. కార్యకర్త రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని.. దానిని ఖండించినందుకు తప్పుడు ఆరోపనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు బాధితుడికి వ్యతిరేకంగా హుళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు.