నలుగురు జవాన్ల వీరమరణం..చర్యల కోసం ఆర్మీకి స్వేచ్ఛ: రాజ్‌నాథ్‌

జమ్ముకశ్మీర్‌లో గత కొంతకాలంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.

By Srikanth Gundamalla  Published on  16 July 2024 1:00 PM IST
jammu kashmir, minister rajnath singh,  freedom,  army ,

నలుగురు జవాన్ల వీరమరణం..చర్యలకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటన

జమ్ముకశ్మీర్‌లో గత కొంతకాలంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వరుసగా దాడులకు పాల్పడ్డారు. ఆయా ఘటనల్లో పలువరు జవాన్లు వీరమరణం పొందారు. అయితే.. మంగళవారం తెల్లవారుజామున కూడా ఇలానే జవాన్లపై కాల్పులు జరిపారు. నలుగురు వీరమరణం పొందారు. వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేదీతో మాట్లాడారు. నలుగురు సైనికులు అమరులైన నేపథ్యంలో ఎలాంటి చర్యలైనా సరే తీసుకోవాలని.. స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆర్మీ చీఫ్‌కు రక్షణశాఖ మంత్రి చెప్పారు. ఇక ఎన్‌కౌంటర్ కు సంబంధించి దోడాలో పరిస్థితిలు, కొనసాగుతున్న ఆపరేషన్ గురించి కూడా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆరా తీశారు.

కాగా.. జమ్ముకశ్మీర్‌ దోడా జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులతో భారత ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో ఓ అధికారి సహా మొత్తం నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు అయినట్లు కూడా తెలసింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే.. ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారనీ.. అందుకే జవాన్లు అసవులు బాశారని సమాచారం. జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండో అతిపెద్ద దాడి ఇదే అని చెబుతున్నారు ఆర్మీ ఉన్నతాధికారులు. గతవారమే కథువాలో ఐదుగురు సైనికులు ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే మరో సంఘటన జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు భద్రతాబలగాలు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. పూర్తిస్థాయి ఉగ్రవాదాన్ని ఆపేందుకు ముందుకెళ్లాలని ఇటీవల ప్రధానినరేంద్ర మోదీ కూడా అన్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన బలగాలు వరుసగా సెర్చ్‌ ఆపరేషన్‌లు చేపడుతున్నాయి. మరోవైపు ఇలాంటి దొంగదెబ్బలతో ఆర్మీ జవాన్లు అమరులు కావడంతో .. కేంద్రం సీరియస్‌గా తీసుకుని తగు చర్యలు తీసుకునేందుకు ఆర్మీకి స్వేచ్ఛను ఇచ్చింది.

Next Story