కుల్గాంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 6:45 PM ISTజమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. కుల్గామ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు.
ఆదిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో వెంటనే ఆర్మీ, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్మీ, పోలీసులను గమనించిన టెర్రరిస్టులు కాల్పులు జరపడం ప్రారంభించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, సైన్యం ఎదురుకాల్పులు చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఎదురు కాల్పుల్లో నలుగురు జవాన్లు, ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని కుల్గామ్ అదనపు ఎస్పీ ముంతాజ్ అలీ భట్టి, రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు మోహన్ శర్మ, సోహన్ కుమార్, యోగిందర్, మహ్మద్ ఇస్రాన్‌లుగా గుర్తించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మరోవైపు భారీ బలగాలు మోహరించి ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. పదేళ్లకు జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది.