జమ్ముకశ్మీర్‌లో కాల్పులు, ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మృతి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 10:00 AM IST
జమ్ముకశ్మీర్‌లో కాల్పులు, ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మృతి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో చోట కూడా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కోకెర్‌నాగ్ అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారు.
అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హవల్దార్ దీపక్ కుమార్ యాదవ్, లాన్స్ నాయక్ ప్రవీణ్ శర్మ విధి నిర్వహణలో అమరులు అయ్యారు. మరోవైపు, ఎదురుకాల్పుల్లో శనివారం గాయపడిన పౌరుల్లో ఒకరు ఆసుపత్రిలో మరణించారు. ఇద్దరు సైనికులు చనిపోవడంపై భారత సైన్యం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తాని అని భారత సైన్యం పేర్కొంది.
అయితే.. అంతకుముందు ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ అందాయి. దాంతో.. భద్రతా దళాలు దక్షిణ కాశ్మీర్‌లోని అటవీ ప్రాంతంలో సోదాలు, కూంబింగ్ ఆపరేషన్‌లు నిర్వహించాయి. కోకెర్‌నాగ్ సబ్‌డివిజన్‌లోని అడవిలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆర్మీ పెట్రోలింగ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు.
ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF కోకెర్‌నాగ్, అనంత్‌నాగ్ ప్రాంతాల్లో సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. దాంతో.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. మరో ఇద్దరు సిబ్బంది గాయపడగా.. వారిని అక్కడి నుండి తరలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అని భారత సైన్యం పేర్కొంది.