జమ్ములో మళ్లీ ఎన్‌కౌంటర్.. జవాను వీరమరణం, ఐదుగురికి గాయాలు

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.

By Srikanth Gundamalla  Published on  27 July 2024 11:39 AM IST
jammu Kashmir, encounter, one jawan, pak terrorist ,death,

జమ్ములో మళ్లీ ఎన్‌కౌంటర్.. జవాను వీరమరణం, ఐదుగురికి గాయాలు 

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులో ఒక భారత సైనికుడు వీరమరణం పొందగా.. ఆర్మీ మేజర్‌ సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టిందని అధికారులు వెల్లడించారు.

శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌ వైపు వెళ్తున్నవారిని భద్రతా దళాలు పసిగట్టాయి. దీంతో వారిని ప్రశ్నించేలోపే.. పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు 3 గంటల పాటు ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ మేజర్ సహా మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మరోవైపు ఇవే కాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇంకా ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది.

అంతకుముందు జూలై 24న, కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో రాత్రిపూట జరిగిన కాల్పుల్లో భద్రతా దళాలు గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను కూడా చనిపోయాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కొండ జిల్లాల ఎగువ ప్రాంతాలలో సుమారు 40 నుండి 50 మంది పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం దాక్కున్నట్లు సమాచారం. వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు ఈ ప్రాంతాల్లో భారీ సెర్చ్‌ ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలోకి చొరబడిన ఈ ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అమెరికా తయారు చేసిన M4 కార్బైన్ రైఫిల్స్‌తో సహా అత్యంత ఆధునిక ఆయుధాలను కలిగి ఉన్నారని సైనిక వర్గాలు చెబుతున్నాయి.

Next Story