జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు, అమరులైన నలుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.
By Srikanth Gundamalla Published on 16 July 2024 8:30 AM IST
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు, నలుగురు జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దోడా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ సాయుధ ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక అధికారి మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ దాడిని పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం) షాడో గ్రూప్ 'కశ్మీర్ టైగర్స్' తామే చేసినట్లుగా ప్రకటించుకుంది.
ధారి గోటె ఉరర్బాగిలో రాత్రి 7.45 గంటల సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే గాలింపు చేపట్టిన కాసేపటికే కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాబలగాలు ఉగ్రవాదుల మధ్య 20 నిమిషాల ఎదురుకాల్పులు జరిగాయి. ఇటీవల పదోన్నతి పొందిన మేజర్ బ్రిజేష్ థప్పా సహా నలుగురు జవాన్లు ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడ్డారని భారత సైన్యం తొలుత ప్రకటన చేసింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమించిందని, చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
కాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు తప్పించుకోవడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. కానీ భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నం చేసిందనీ.. దాంతో దాదాపు రాత్రి 9 గంటలకు అడవుల్లో మరో కాల్పులకు దారితీశాయని అధికారులు వెల్లడించారు. సవాళ్లతో కూడిన భూభాగం, దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ ఆర్మీ ఆఫీసర్ నేతృత్వంలోని ధైర్యవంతులైన సైనికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.