జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు, ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజుల నుంచి ఉగ్రవాదుల అలజడి ఎక్కువైంది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 3:17 PM ISTజమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు, ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజుల నుంచి ఉగ్రవాదుల అలజడి ఎక్కువైంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరివేయాలన్న లక్ష్యంతో వరుసగా ఆపరేషన్లు చేపడుతోంది. దాంతో.. ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ వీరమరణం చెందారు. అస్సార్ అలీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఇంకా అక్కడ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.
అయితే.. శివ్‌గఢ్-అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం ఆర్మీకి అందింది. దాంతో.. వెంటనే రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్మీ రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలిలో అమెరికాలో తయారైన అత్యాధునిక ఎం-4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ జవాన్లు. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌లను గుర్తించారు. అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు తాజా ఉగ్రదాడి జరగడం కలకలం రేగుతోంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్‌తో సమావేశమైన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కశ్మీర్‌లో పరిస్థితులపై సమీక్షించారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జమ్ము కశ్మీర్‌లో హైఅలర్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.