జమ్ముకశ్మీర్‌లో ముగిసిన తొలిదశ పోలింగ్.. 58.19 శాతం ఓటింగ్
జమ్మూ కాశ్మీర్‌లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది.
By Srikanth Gundamalla Published on 18 Sept 2024 7:15 PM ISTజమ్మూ కాశ్మీర్‌లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. రాష్ట్రంలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక ఎన్నికల్లో భాగంగా మొదటి దశ ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్కచోటా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇక తొలి దశ ఓటింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 58.19 శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. జమ్ముకశ్మీర్‌లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అప్పటి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్వ్యవస్థీకరించింది. ఆ త్వాత ఎన్నికలు జరుగుతుండటంతో అందరి దృష్టి జమ్ముకశ్మీర్‌పై ఉంది.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, ఇందర్వాల్ గరిష్టంగా 80.06 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. పద్దర్-నాగ్సేనిలో 76.80 శాతం, కిష్ట్వార్‌లో 75.04 శాతం పోలింగ్ నమోదైంది. డోడా వెస్ట్‌లో కూడా అత్యధికంగా 74.14 శాతం పోలింగ్ నమోదైంది. కశ్మీర్ లోయలోని పహల్గామ్ సెగ్మెంట్‌లో అత్యధికంగా 67.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో డీహెచ్ పోరాలో 65.21 శాతం, కుల్గామ్ లో 59.58, కోకెర్‌నాగ్ 58 శాతం, దూరులో 57.90 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా 40.58 శాతం పోలింగ్ ట్రాల్ సెగ్మెంట్‌లో నమోదైంది. పుల్వామా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు ఇంకా 50 శాతం మార్కును దాటలేదని ఎన్నికల అధికారులు చెప్పారు.
ఎన్నికల సంఘం (EC) ప్రకారం, ఫేజ్ 1లో మొత్తం 23,27,580 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు కాగా.. వీరిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 14,000 మంది పోలింగ్ సిబ్బంది 3,276 పోలింగ్ స్టేషన్లలో ప్రక్రియను పర్యవేక్షిస్తారు, ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తారు. జమ్మూ కాశ్మీర్‌లో అత్యధికంగా ఓటింగ్ జరిగేలా అసెంబ్లీ ఎన్నికల కోసం పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది.