కాంగ్రెస్ యూత్ వింగ్(ఐవైసీ) జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తనని ఆరు నెలల నుంచి వేధిస్తున్నాడని అసోం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అంగ్‌కితా దత్తా సంచలన ఆరోపణలు చేశారు. ఇష్టమొచ్చినట్లుగా ఆయన తనకు సందేశాలు పంపాడని ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణలు చేసింది. యూత్ కాంగ్రెస్ అసోం కార్యదర్శి వర్ధన్ యాదవ్ ద్వారా తనని కావాలనే అవమానించేవారని, చులకనగా మాట్లాడేవారని ఆరోపించింది. బీవీ శ్రీనివాస్ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో.. ఆయన గురించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపింది. అప్పటి నుంచి శ్రీనివాస్ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని ఆమె ఆరోపించింది. మహిళల సంరక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. బీవీ శ్రీనివాస్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. పార్టీలోని ఒక మహిళను వేధిస్తే తననెవరూ అడ్డుకోలేరన్న ఉద్దేశంలో బీవీ శ్రీనివాస్ ఉన్నాడని అంగ్‌కితా పేర్కొంది. అంగ్‌కితా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ యూత్ వింగ్ ఖండించింది. ఆమె బీజేపీతో టచ్‌లో ఉందని, వాళ్ల ఆదేశాల మేరకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేసిందని కాంగ్రెస్ యూత్ వింగ్ చెప్తోంది.
విచారణకు రావడానికి కూడా తాను సిద్ధమేనని అంగ్‌కితా అంటోంది. తన వద్ద బీవీ శ్రీనివాస్ పంపిన మెసేజ్‌లు ఉన్నాయని తెలిపింది. తానేమీ పార్టీ మారాలని అనుకోలేదని కూడా చెప్పింది. తాను సీఎం హిమంత బిశ్వ శర్మను కలిసింది కేవలం ఓ మెంటల్ హెల్త్ కేర్ ప్రాజెక్టు కోసమే అని స్పష్టం చేసింది.