అమెరికా వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేసిన కేంద్రం
జీ20 సదస్సు, భారత్‌కు అమెరికా అధ్యక్షుడు బైడన్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 7 Sept 2023 4:49 PM IST
అమెరికా వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేసిన కేంద్రం
భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈనెల 9, 10వ తేదీల్లో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు. అయితే.. జీ20 సదస్సు, భారత్‌కు అమెరికా అధ్యక్షుడు బైడన్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన పలు వస్తువులపై భారత్ అదనపు సుంకాలను ఎత్తివేసింది.
అదనపు సుంకాలు ఎత్తివేసిన అమెరికాకు చెందిన వస్తువుల్లో శెనగలు, ఉలవలు, యాపిల్స్, వాల్‌నట్స్, బాదం ఉన్నాయి. 2019లో భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను పెంచింది. దీనికి బదులుగా పలు ఉత్పత్తులపై భారత్ సైతం అదనపు సుంకాలు విధించింది. వాటిలో కొన్నింటికి తాజాగా మినహాయింపునిచ్చింది. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో జోబైడెన్ సమావేశం కానున్నారు. దేశాధినేతల భేటీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రధాని మోదీ జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు ఆరు ఆంశాల్లో నెలకొన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అందులో తాజాగా రద్దు చేసిన అదనపు సుంకాల అంశం సైతం ఉంది. మరోవైపు అమెరికా బాదం, వాల్‌నట్స్, శెనగలు, ఉలవలు, యాపిళ్లు, వైద్య పరీక్షల రీఏజెంట్లు, బోరిక్ యాసిడ్‌పై విధించిన అదనపు సుంకాలను ఎత్తివేయనున్నామని జులైలో రాజ్యసభలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. దీనివల్ల భారత్‌కు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు.