భారత్ మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో ప్రయోగం చేపట్టింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అగ్ని-5 5000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించనున్నది. అగ్ని సిరీస్ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కొత్త అగ్ని క్షిపణి 5వేల నుంచి 8వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ఛేదించనున్నట్లు సమాచారం. అగ్ని-5 పరీక్ష 2020లోనే జరుగాల్సి ఉండగా.. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది. ఉపరితం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అగ్ని – 5 బాలిస్టిక్ క్షిపణినిని బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిని భారత రక్షణ రంగంలో మరో పెద్ద విజయంగా అభివర్ణించారు.