రామాయణం స్కిట్‌లో అపహాస్యం.. ఒక్కో విద్యార్థికి రూ.1.20లక్షల ఫైన్
2024 మార్చి నెలాఖరులో ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 7:00 AM GMTరామాయణం స్కిట్‌లో అపహాస్యం.. ఒక్కో విద్యార్థికి రూ.1.20లక్షల ఫైన్
రామాయణాన్ని చాలా వరకు నాటక రూపంలో చూపెడుతుంటారు. తాజగా ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు రామయణాన్ని అపహాస్యం చేసేలా ప్రదర్శించారు. అంతే దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, సదురు విద్యాసంస్థపైనా విమర్శలు వచ్చాయి. దాంతో.. ఆ విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఏకంగా వారికి రూ.1.20 లక్షల చొప్పున జరిమానా విధించింది విద్యాసంస్థ. ఈ ఘటన ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థలో చోటుచేసుకుంది.
2024 మార్చి నెలాఖరులో ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు విద్యార్థులు రాహోవన్ అనే నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణం ఇతిహాసం ఇతివృత్తంగానే ఈ స్కిట్‌ను చేశారు. నాటకంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను కూడా విద్యార్థులు వాడలేదు. కానీ.. అరణ్యవాసంలో కొన్ని ఘట్టాలను రామాయణం పోలిన సన్నివేశాలను ప్రదర్శించారు. ఈ స్కిట్‌లో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. పవిత్ర రామాయణాన్ని కించపరిచారని మండిపడ్డారు పలువురు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. దాంతో.. ఐఐటీ బాంబే యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. చర్యలను తీసుకుంది.
క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపింది. అనంతరం నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలను తీసుకుంది. ఇందులో గ్రాడ్యుయేట్ విద్యార్థులతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. సీనియర్లకు రూ.1.2 లక్షల జరిమానా విధించింది. జూనియర్లకు రూ.40వేల చొప్పున ఫైన్ వేశారు. ఇక సీనియర్ విద్యార్థులు జింఖానా అవార్డులు తీసుకునేందుకు అనర్హులుగా ప్రకటించారు.