భార్యను 12 ఏళ్లుగా గదిలోనే బంధించిన భర్త, చివరకు...
ఓ మహిళకు నరకం చూపించాడు భర్త. పన్నెండేళ్ల పాటు కనీసం బాహ్యప్రపంచం ఎలా ఉంటుందో కూడా చూపించలేదు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 2:00 PM ISTభార్యను 12 ఏళ్లుగా గదిలోనే బంధించిన భర్త, చివరకు...
మహిళలు వివాహ బంధంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి జీవితం పూర్తిగా మారబోతుందనీ.. వచ్చేవాడు ఎలా చూసుకుంటాడో అని కలలు కంటుంటారు. అయితే.. అలా కలలు కన్న ఓ మహిళకు నరకం చూపించాడు భర్త. పన్నెండేళ్ల పాటు కనీసం బాహ్యప్రపంచం ఎలా ఉంటుందో కూడా చూపించలేదు. ఈ సంఘటనలో కర్ణాటకలో చోటుచేసకుంది. పోలీసులు సదురు మహిళలను విడిపించారు.
కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అతనికి అది మూడో వివాహం. అంతా బావుంటుందిలే అనుకున్న మహిళకు పెళ్లిన తర్వాత నుంచి నరకం చూపించాడు. పన్నేండేళ్ల వివాహ జీవితంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. అతను బయటకు వెళ్లే ప్రతిరోజు భార్యను లోపలే ఉంచి.. తాళం వేసి వెళ్లేవాడు. మళ్లీ భర్త వచ్చి డోర్ ఓపెన్ చేసే వరకు బాధితురాలు ఇంట్లోనే ఉండేది. ఇలా పన్నేండేళ్లు గడిపింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లి భర్త కంటే ముందే వచ్చినా.. తండ్రి వచ్చే వరకు బయటే కూర్చొనే వారు. దాంతో.. తల్లి పిల్లలకు కిటికీలో నుంచే ఆహారాన్ని అందించేది.
ఇక ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు సదురు ఇంటికి వెళ్లారు. మహిళను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేస్తారా అని పోలీసులు అడగ్గా.. దానికి ఆమె నిరాకరించింది. కానీ.. తన భర్తతో పన్నెండేళ్ల పాటు నరకం చూశానని వాపోయింది. మలమూత్ర విసర్జన కోసం బాక్సుని ఉపయోగించినట్లు ఆవేదన చెందింది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక దగ్గరికి తీసుకోలేని పరిస్థితి ఉండిందని చెప్పింది. కాగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉండాలని అనుకుంటున్నట్లు పోలీసులతో చెప్పింది.