ప్రొక్లెయిన్‌పై పడ్డ బండరాయి..క్షణంలో తప్పిన ప్రమాదం (వీడియో)

ఓ ప్రొక్లెయిన్ బండరాళ్లను తొలగిస్తుండగా అనుకోకుండా ప్రమాదం ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  18 July 2023 12:35 PM IST
Himachal Pradesh, Proclainer Accident,  Viral,

ప్రొక్లెయిన్‌పై పడ్డ బండరాయి..క్షణంలో తప్పిన ప్రమాదం (వీడియో)

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా వరద పెద్దఎత్తున సంభవించింది. రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక కొన్ని గ్రామాలు అయితే వరద నీటిలో చిక్కుకున్నాయి. జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండప్రాంతాల్లో అయితే కొండ చరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. అయితే. వాటిని ఇప్పుడు అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రొక్లెయిన్ బండరాళ్లను తొలగిస్తుండగా అనుకోకుండా ప్రమాదం ఎదురైంది. బండరాళ్లను పక్కకు నెడుతుండగా.. పై నుంచి మరో బండరాయి వాహనంపై పడిపోయింది. ఒక్క క్షణంలో ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా కొండప్రాంతాల్లో రోడ్లపై బండరాళ్లు పడిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులు వాటిని తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఒక ప్రొక్లెయినర్‌ రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగిస్తోంది. ఎక్కువగా బండరాళ్లు ఉండటంతో వాటిని పక్కకు నెట్టే పనులు కొనసాగుతున్నాయి. అయితే.. ఉన్నట్లుండి ప్రమాదం జరిగింది. కొండ మొత్తం బురదగా ఉన్నట్లుంది. అతనలా రోడ్డుపై పడిన రాళ్లను తొలగిస్తుంటూ పైన ఉన్న మరికొన్ని బండరాళ్లు కదిలిపోయాయి. పెద్ద బండరాళ్లు పైనుంచి కిందకు పడసాగాయి. క్షణాల్లోనే ప్రొక్లెయినర్‌పై పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ ఒక్క క్షణం ముందు వాహనం నుంచి కిందకు దూకాడు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో అక్కడే ఉన్నవారంతా భయపడిపోయారు. ప్రొక్లెయినర్‌ దగ్గర నుంచి దూరంగా పరుగులు తీశారు. ఇదంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అతని అదృష్టం బాగుందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టే బతికిపోయాడంటున్నారు. ఇంకొందరైతే అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే ఇలాంటి ప్రమాదాలు చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.

Next Story