భారీ వర్షాలకు సిమ్లాలో కూలిన శివుడి ఆలయం, 9మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం అతలాకుతలం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 3:20 PM ISTభారీ వర్షాలకు సిమ్లాలో కూలిన శివుడి ఆలయం, 9మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కొన్ని రోజుల క్రితం కుంభవృష్టిగా కురిసిన వర్షాలతో వరదలు పోటెత్తాయి. తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు మరోసారి హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టితో పలుచోట్ల ప్రమాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సిమ్లాలోని ఓ ఆలయంపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆగస్టు 14న ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో.. ఆలయం కుప్పకూలిపోయింది. అప్పటికే ఆలయంలో ఉన్న పలువురు భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 9 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. మరో 20 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన వారిని కూడా బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖు తెలిపారు. ఆదివారం సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విసయం తెలిసిందే. సిమ్లాలో గత 24 గంటల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. కాగా.. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డ కారణంగా దాదాపు 750 రోడ్లపై వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.