హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు, నూహ్ జిల్లాలో కర్ఫ్యూ
హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 12:07 PM ISTహర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు, నూహ్ జిల్లాలో కర్ఫ్యూ
హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోంగార్డులు మృతి చెందారు. ఇక ఆ తర్వాత రాత్రి మరోసారి జరిగిన ఘర్షణల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. దాదాపు 45 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నూహ్ జిల్లాకు ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లోనూ ఈ ఘర్షణ ప్రభావం చేరింది.
ప్రస్తుతం నూహ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. దాంతో అక్కడ మరోసారి అనూహ్య ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. కర్ఫ్యూ విధించినట్లు మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అలాగే భద్రతను మరింత పెంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఘర్షణల్లో 20 కేసులు నమోదు అయినట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. బాధ్యులను గుర్తించేందుకు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
సోమవారం వీహెచ్‌పీ ర్యాలీని నుహ్ జిల్లాలో ఓ వర్గం వారు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఘర్షణ తలెత్తింది. దాడుల్లో ఇద్దరు హోంగార్డులు ప్రాణాలు కోల్పోగా... మరో 15 మంది గాయపడ్డారు. ఇరు వర్గాల వాళ్లు రాళ్లు రువ్వుకున్నారు, కార్లకు నిప్పుపెట్టారు. నుహ్ జిల్లాలో 20 కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు కావాలంటూ కేంద్రాన్ని హర్యానా సర్కార్ కోరింది. సోహ్నా, మనేశ్వర్, పటౌడి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
హర్యానాలో ఘర్షణలపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు. ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని.. రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కోరారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని అన్నారు. వదంతులు వ్యాప్తి చెందకుండా ఇంటెర్నెట్‌పై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అలాగే విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. కాగా.. సోషల్ మీడియాలో ఉంచిన ఒక వీడియో ఈ ఘర్షణలకు కారణమైందని అధికారులు భావిస్తున్నారు.