హర్యానాలో రైతులపైకి దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు

Haryana farmers allege protester injured after being hit by BJP MP's car.లఖీమ్‌పూర్‌ హింసాత్మక ఘటన మరిచిపోక ముందే

By M.S.R  Published on  7 Oct 2021 11:14 AM GMT
హర్యానాలో రైతులపైకి దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు

లఖీమ్‌పూర్‌ హింసాత్మక ఘటన మరిచిపోక ముందే అలాంటి ఘటన చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. హర్యానాలో బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు రైతులు ఆరోపించారు. గాయపడిన రైతును అంబాల సమీపంలోని నారిన్‌గఢ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం పంపామని రైతులు చెబుతున్నారు. అతడి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తనపైకి బీజేపీ ఎంపీ కారు దూసుకురాగా తృటిలో తప్పించుకున్నట్లు ఒక రైతు ఆరోపించాడు.

కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ, హర్యానా మైనింగ్ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర పార్టీ నాయకులు గురువారం నారిన్‌గఢ్‌లోని సైనీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. క బీజేపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఆ భవనం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కార్యక్రమం ముగియడంతో బయటకు వచ్చిన బీజేపీ ఎంపీ నయాబ్‌ సైనీ కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని హర్యానా రైతులు డిమాండ్‌ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరిలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కు చెందిన కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. ఆ ఘటన చోటు చేసుకున్న నాలుగు రోజుల తర్వాత హర్యానాలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Next Story
Share it