రైల్వే ట్రాక్‌పైకి పది సింహాలు.. లోకో పైలట్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం
ఉన్నట్లుండి రైల్వే ట్రాక్‌పైకి ఏకంగా పది సింహాలు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 10:13 AM IST
రైల్వే ట్రాక్‌పైకి పది సింహాలు.. లోకో పైలట్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం
ఉన్నట్లుండి రైల్వే ట్రాక్‌పైకి ఏకంగా పది సింహాలు వచ్చాయి. అదే సమయంలో ట్రాక్‌పై గూడ్స్ రైలు వస్తోంది. అది అర్ధరాత్రి కావడంతో దగ్గరకు వచ్చే వరకు సింహాలు కనపడలేదు. కానీ.. లోకో పైలట్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సడెన్ బ్రేక్ వేయడంతో సింహాలను ఢీకొట్టకుండా రైలు ఆగిపోయింది. దాంతో.. సింహాలన్నీ క్షేమంగా బయటపడ్డాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. లోకో పైలట్ ముఖేశ్ కుమార్ మీనాపై ప్రశంసలు కురిపిస్తున్నారు రైల్వే అధికారులు.
పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్‌లోకి గూడ్స్ రైలును తీసుకెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సింహాలను చూసిన వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులను వేశాడు. సింహాలు అక్కడి నుంచి వెళ్లే వరకు వేచి చూసి ఆ తర్వాత ట్రైన్‌ను ముందుకు నడిపాడని అధికారులు చెప్పారు. వన్యప్రాణుల కోసం భావ్‌నగర్ రైల్వే డివిజన్ అన్ని విధాలా కృషి చేస్తోందని అధికారులు చెప్పారు. లోకో పైలట్లు అంతా ట్రాక్‌లపై నడిచి వెళ్తున్న వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.
కాగా.. పిపావవ్ పోర్టును ఉత్తర గుజరాత్‌తో కలిపే రైలు మార్గం. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో చాలా సింహాలు చనిపోయాయి. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు కొన్నిచోట్ల వన్యప్రాణులు ట్రాక్‌లపైకి రాకుండా కంచెలు ఏర్పాటు చేశారు. అలాగే సింహాలను కాపాడాలని కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేలకు పలు ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. అప్పటి నుంచి సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. 2020 నాటి నివేదిక ప్రకారం గుజరాత్‌లో 600కి పైగా సింహాలు ఉన్నాయి.