ఈ నెల 14 లేదా 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..?
దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 9:37 AM ISTఈ నెల 14 లేదా 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..?
సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు పొత్తులు పెట్టుకోవడమే కాదు.. ఉమ్మడిగా అభ్యర్థులను ప్రటించాయి. ఇక ఏపీలో బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. రేపోమాపో సీట్ల పంపకాలు కూడా పూర్తి చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ అతి త్వరలోనే వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే. ఎన్నికల సంఘం అధికారులు జమ్ము, కశ్మీర్‌లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు పర్యటించనున్నారు. అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా? లేదా అన్న దానిపై పరిశీలించనున్నారు. ఇక ఈ పర్యటన తర్వాత వెంటనే మార్చి 14 లేదా 15వ తేదీన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి పలు ఆదేశాలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. దాంతో.. సుప్రీం ఆదేశాల మేరకు జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా లేదా అన్నది చూడనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఈసీ అధికారులు జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈసీ పరిశీలన పూర్తయిన వెంటనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది.