ఉప్పొంగిన యమునా నది.. తాజ్‌మహల్‌కు వరద ముప్పు తప్పదా?
ఆగ్రాలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తాజ్ మహల్‌కు కూడా వరద ముప్పు ఏర్పడింది.
By Srikanth Gundamalla
ఉప్పొంగిన యమునా నది.. తాజ్‌మహల్‌కు వరద ముప్పు తప్పదా?
ఆగ్రాలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో.. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో అధిక వర్షాలు కురవడంతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తాజాగా ఆగ్రాలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. తాజ్ మహల్‌కు కూడా వరద ముప్పు ఏర్పడింది. యమునా నది నీరు తాజ్ మహల్ సరిహద్దు గోడను తాకడంతో మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వరద మరింత పెరిగే ప్రమాదమే అని భావిస్తున్నారు స్థానికులు .
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశరాజదాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. దాంతో.. యమునా నదికి వరద పోటెత్తింది. పలు చోట్ల వరద ముప్పుతో రోడ్లు, బ్రిడ్జిలు తెగిపోయాయి. ఆ వరద ఇప్పుడు ఆగ్రాలో కూడా ఉగ్రరూపం దాల్చింది. ఆగ్రాలో పెరుగుతున్న నీటిమట్టం కారణంగా తాజ్ మహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు వరద ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజ్‌మహల్ పక్కనే పారుతున్న యమునా నది వరదనీరు తాజ్ లోకి ప్రవేశిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరదలను నివారించడానికి సికంద్రాలోని కైలాష్ ఆలయం నుంచి తాజ్ మహల్ సమీపంలోని దసరా ఘాట్ వరకు నది ఘాట్‌లపై అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
యమునాలో నీటి మట్టం ఆగ్రాలో 495.8 అడుగులకు చేరుకోవడంతో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. తాజ్‌మహల్‌కు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వరద ఇప్పుడు తగ్గుతోందని.. ఈ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. తాజ్ మహల్ వద్ద వరదను చూసిన వారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.