గవర్నర్‌ను వదిలేసి టేకాఫ్‌ తీసుకున్న విమానం..అధికారులు సీరియస్

కర్ణాటకలో గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తుండగానే.. ఆయన ఎక్కాల్సిన విమానం టేకాఫ్‌ తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  28 July 2023 2:59 PM IST
Flight, take off,  Karnataka governor,

గవర్నర్‌ను వదిలేసి టేకాఫ్‌ తీసుకున్న విమానం..అధికారులు సీరియస్

కర్ణాటకలో గవర్నర్ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తుండగానే.. ఆయన ఎక్కాల్సిన విమానం టేకాఫ్‌ తీసుకుంది. ప్రొటోకాల్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఎయిర్‌ఏషియా సిబ్బందిపై అధికారులు ఫైర్ అవుతున్నారు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషన్‌ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌కు వెళ్లేందుకు కర్ణాటక గవర్నర్‌ (Governor) థావర్‌చంద్‌ గహ్లోత్‌ గురువారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన ఎక్కాల్సిన విమానం ఎయిర్ఏషియాలో లగేజ్‌ను కూడా ఎక్కించారు. ఆ తర్వాత గవర్నర్ వీఐపీ లాన్ నుంచి టర్నమినల్‌ 2కు చేరుకున్నారు. కానీ.. అప్పటికే విమానం టేకాఫ్‌ తీసుకుంది. విమానం గాల్లోకి ఎగిరిపోయిందని ఎయిర్‌పోర్టు అధికారులు కూడా వెల్లడించారు. గవర్నర్ టర్మినల్ వద్ద బోర్డింగ్‌ గేట్‌కు చేరుకోవడంలో ఆలస్యం అయ్యిందని.. అందుకే విమానం వెళ్లిపోయిందని పలు వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. ఎయిర్‌ఏషియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని గవర్నర్ ప్రొటోకాల్‌ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఎయిర్‌ ఏషియా విమానం వెళ్లిపోయిన 90 నిమిషాల తర్వాత మరో విమానంలో గవర్నర్ హైదరాబాద్‌కు బయల్దేరారు. అప్పటి వరకు గవర్నర్ ఎయిర్‌పోర్టులోనే వేచిచూడాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

గవర్నర్‌ను ఎక్కించుకోకుండా టేకాఫ్‌ తీసుకున్న ఘటనపై ఎయిర్‌ ఏషియా విమానయాన సంస్థ స్పందించింది. గవర్నర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎయిర్‌ఏషియా ప్రతినిధులు. గవర్నర్ కార్యాలయంతో తమ సంబంధాలను ఎప్పుడూ గౌరవిస్తామని, ప్రొటోకాల్‌కు కట్టుబడే ఉంటామని తెలిపారు.


Next Story