లోక్‌సభ ఎన్నికల్లో తొలి థర్డ్ జెండర్ వ్యక్తి నామినేషన్ దాఖలు
తొలి థర్డ్ జెండర్ వ్యక్తి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాడు.
By Srikanth Gundamalla Published on 4 May 2024 8:32 PM ISTలోక్‌సభ ఎన్నికల్లో తొలి థర్డ్ జెండర్ వ్యక్తి నామినేషన్ దాఖలు
తొలి థర్డ్ జెండర్ వ్యక్తి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాడు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు.. 26 ఏళ్ల రాజన్ సింగ్ శుక్రవారమే నామినేషన్ దాఖలు చేశాడు. ధోతీ, టోపీ, ఆభరణాలు ధరించిన అతడు ఒంటరిగానే వెళ్లి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించాడు. ఈ మేరకు అధికారులకు తన ఆస్తుల వివరాలను కూడా అతను వెల్లడించాడు. చేతిలో రూ.లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, బ్యాంకు ఖాతాలో రూ.10వేలకు పైగా నగదు, మొత్తం రూ.15.10 లక్షల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఇక ఎలాంటి స్థిరాస్తులు లేవని కూడా రాజన్ సింగ్.
కాగా.. ఇతను బీహార్ నుంచి వలస వచ్చాడు. 2010 నుంచి ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. థర్డ్ జెండర్ వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యాలు లేవనీ.. సామాజిక అంగీకారం, హక్కుల కోసవం వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని రాజ్ అన్నాడు. అలాగే ప్రజలతో పాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ వెల్లడించాడు. సుదీర్ఘ ప్రక్రియ వల్ల థర్డ్ జెండర్‌గా ధృవీకరణ పత్రాలు పొందేందుకు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని అతను చెప్పాడు.
విద్యా, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు జాతీయ ట్రాన్స్ జెండర్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాజన్ సింగ్ కోరాడు. థర్డ్ జెండర్ వ్యక్తుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ప్రత్యేక వాష్‌రూమ్‌లు, క్యూలైన్లు వంటి ప్రాథమిక అవసరాలను ప్రభుత్వమే తమకు కల్పించాలని రాజన్ సింగ్ డిమాండ్ చేశాడు.