తమిళనాడులో బాణసంచా గోదాంలో పేలుడు, ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా భద్రపరిచిన గోదాంలో పేలుడు చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 12:46 PM ISTతమిళనాడులో బాణసంచా గోదాంలో పేలుడు, ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. కృష్ణగిరి ప్రాంతంలో ఉన్న ఓ బాణసంచా భద్రపరిచిన గోదాంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయడపడ్డారు.
పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుం వారు చికిత్స పొందుతున్నారు. అయితే.. వీరిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. దాంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. కాగా.. అప్పటికే మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది.
పేలుడు సంభవించిన బాణసంచా గోదాం నివాసాల సముదాయాల మధ్య ఉంది. దాంతో.. పేలుడు ధాటికి పక్కనే ఉన్న మూడు ఇళ్లు నేలకూలాయి. ఘటనాస్థలంలో అధికారులు, పోలీసులు సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కూలిన ఇళ్ల శిథిలాల కింద ఎవరైనా ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శిథిలాలను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. మూడు ఇళ్లు కూడా కూలిపోవడంతో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కాగా... పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తమిళనాడులో ఈ తరహా ఘటనలు ప్రతి ఏడాది చోటుచేసుకుంటున్నాయి. కనీస రక్షణ చర్యలు తీసుకోక కొన్నిసార్లు.. నిర్లక్ష్యం మరికొన్నిసార్లు ప్రాణాలు బలికొన్నది.