బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. పలు రికార్డులు బ్రేక్
వరుసగా ఆరో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించారు నిర్మలా సీతారామన్.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 4:53 PM IST
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. పలు రికార్డులు బ్రేక్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టర్మ్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన బడ్జెట్‌ను నిర్మలమ్మ లోక్‌సభలో చదవి వినిపించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పలు రికార్డులను బ్రేక్ చేశారు. వరుసగా ఆరో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించారు నిర్మలా సీతారామన్. మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. ఆయన 1959-64 సమయంలో ఐదు రెగ్యులర్ బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడం విశేషం.
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఇదే సమయంలో.. గత ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీలను అధిగమించనున్నారు. వీరందరూ 5 సార్లు బడ్జెట్ వరుసగా ప్రవేశపెట్టారు. మరోవైపు చరిత్రలోనే సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన జాబితాలో కూడా నిర్మల సీతారామన్ నిలిచారు. కానీ.. ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం చాలా తక్కువ సమయంలోనే ముగించారు. కేవలం 58 నిమిషాల పాటు మాత్రమే బడ్జెట్‌పై లోక్‌సభలో ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో నిర్మల 5,246 పదాలను ఉపయోగించారు. నిర్మలమ్మ ఆరు బడ్జెట్ ప్రసంగాలను చూస్తూ ఇదే తక్కువ సమయంలో పూర్తి చేసిన ప్రసంగం. బడ్జెట్ ప్రసంగాల్లో 2020లో చేసిన బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల సమయాలు:
* 2019 బడ్జెట్ 137 నిమిషాలు (2 గంటల 17 నిమిషాలు)
* 2020 బడ్జెట్ 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు)
* 2021 బడ్జెట్ 110 నిమిషాలు (గంట 50 నిమిషాలు)
* 2022 బడ్జెట్ 93 నిమిషాలు (గంట 33 నిమిషాలు)
* 2023 బడ్జెట్ 87 నిమిషాలు (గంట 27 నిమిషాలు)
* 2024 బడ్జెట్ (మధ్యంత బడ్జెట్) 58 నిమిషాలు
నిర్మలా సీతారామన్ 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పూర్తిస్థాయి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళగాఆమె నిలిచారు. 1970-17 బడ్జెట్‌ను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి రికార్డును సృష్టించారు. అయితే.. ఇందిరాగాంధీ అప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.