ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్‌కు రైతుసంఘాల పిలుపు
మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 7:23 AM ISTఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్‌కు రైతుసంఘాల పిలుపు
మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైతులు వేలాదిగా దేశరాజధానికి తరలి వెళ్లారు. దాంతో.. ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల రైతులు, భద్రతా బలగాల మధ్య తోపులాటలు, హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే సంయుక్త్ కిసాన్ మోర్చా రైతుసంఘాలను ఏకం చేసి గ్రామీణ భారత్ బంద్‌కు పలుపునిచ్చింది. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్‌ను పాటించాలని రైతుసంఘాల నాయకులు కోరారు.
ఇక ఈ బంద్‌నకు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈనెల 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగనున్నట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. భారత్ బంద్‌తో పాటు అదే రోజు మధ్యాహ్నం 12 గంల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు 'చక్కా జామ్'లో పాల్గొంటారని రైతు సంఘాలు తెలిపాయి. పంజాబ్‌లో శుక్రవారం 4 గంటల పాటు రాష్ట్ర, జాతీయ రహదారులను రైతుసంఘాలు మూసివేయనున్నాయి.
రైతుల డిమాండ్లు:
రైతులు ప్రధానంగా తమకు పెన్షన్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలకు సరైన కనీస మద్దతు ధరతో పాటు.. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్దరించాలని కోరుతున్నారు. కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉద్యమ బాట పట్టారు. అంతేకాదు... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని, శ్రామిక శక్తిని కాంట్రాక్ట్ చేయవద్దని, ఉపాధికి హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రైతుసంఘాల బంద్ పిలుపుతో గ్రామాల్లో రవాణా, వ్యవసాయ కార్యకలాపాలు, ఉపాధి హామీ గ్రామీణ పనులు, ప్రయివేట్ కార్యాలయాలు, గ్రామాల్లోని దుకాణాలు, గ్రామీణ పారిశ్రామిక, సేవారంగ సంస్థలు ఫిబ్రవరి 16వ తేదీన మూతపడనున్నాయి. గ్రామీణ బంద్ రోజున ఏ రైతు, వ్యవసాయ కార్మికుడు, గ్రామీణ కార్మికుడు పనిచేయొద్దని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక ఈ బంద్ నుంచి అంబులెన్స్‌లు, వార్తాపత్రికల పంపిణీ, వివాహాలు, మెడికల్ షాపులు, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.