ఆ చట్టాలు మాకొద్దు.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు

Farmer union decides Bharat bandh .. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని

By సుభాష్  Published on  8 Dec 2020 2:39 AM GMT
ఆ చట్టాలు మాకొద్దు..  ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు ఈ రోజు భారత్‌ బంద్‌ ప్రకటించాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటి వరకూ కేంద్రంతో ఐదు సార్లు ఆందోళన చేస్తున్న రైతు నేతలతో చర్చలు జరిపింది. వారు నిర్వహించిన చర్చలు ఏ మాత్రం ఫలించలేదు.పార్టీల జండాలు లేకుండానే బంద్‌లో పాల్గొనాలని రైతు నేతలు కోరారు. వారి కోరిక మేరకు ఆకుపచ్చ జెండాలతోనే బంద్‌లో పాల్గొంటున్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తాము ఉంటున్న చోటే నిరసనలు వ్యక్తం చేస్తూ బంద్‌కు మద్దతిస్తున్నందున ఈ ఆందోళన అంతర్జాతీయ రూపు సంతరించుకోనుందని ప్రకటించాయి.

అన్ని పార్టీల మద్దతు

వివాదస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్‌ కొనసాగనుంది. ఈ నిరసన కార్యక్రమంలో ఇప్పటికే కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, ఆప్‌, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ,టీఆర్‌ఎస్‌ సహా దాఆపు అన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాల్గొనాలని కోరాయి.

ఉదయం 11 నుంచి 3 గంటల వరకు

మరో వైపు రైతులు ప్రకటించిన బంద్‌నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాలు ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. మంళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిపే బంద్‌లో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకూడదని రైతు సంఘాల నేతలు తెలిపారు. నాలుగు గంటల పాటు దుకాణాలను మూసివేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామని అన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్‌ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

కోవిడ్‌ నిబంధనలు

కాగా, కోవిడ్‌ ప్రభావం ఉన్నందున మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశించింది. భద్రతను కట్టదిట్టం చేయాలని, శాంతియుతంగా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని స్పష్టం చేసింది.

Next Story
Share it