భారత్ బంద్ కార్యక్రమం ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గత పది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు సోమవారం పది గంటలపాటు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్య, ఇతర సంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలను మూసివేయాని డిమాండ్ చేశారు. పలు ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే పంజాబ్‌కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
లుధియానాకు చెందిన 65 ఏండ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే 'భారత్ బంద్'కు కొన్ని గంటల ముందు ఆయన బలవన్మరణం చెందాడు. లుధియానాలోని నిరసన ప్రాంతానికి సమీపంలో మెడలో వేసుకున్ని కండువాతో ఒక పైప్‌కు ఉరి వేసుకున్నాడు. సోమవారం ఉదయం రైతులు ఈ విషయాన్ని గమనించారు. మరణించిన రైతు భార్య కూడా ఢిల్లీ సరిహద్దులోని టిక్రి వద్ద గత పది నెలలుగా నిరసన తెలుపుతోంది.
మరోవైపు.. సింఘు సరిహద్దు వద్ద సోమవారం ఉదయం నిరసనల్లో పాల్గొన్న 54 ఏళ్ల రైతు మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు ఇవ్వగలమని పోలీసులు తెలిపారు.