లోక్‌సభ ముందుకు ఓటరు కార్డు-ఆధార్ లింక్ బిల్లు
Election Laws Bill introduced in Lok Sabha.డూప్లికేషన్‌ను తొలగించేందుకు ఓటర్ల జాబితాలను ఆధార్ వ్యవస్థతో
By M.S.R Published on 20 Dec 2021 1:36 PM ISTడూప్లికేషన్‌ను తొలగించేందుకు ఓటర్ల జాబితాలను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించడానికి ఉద్దేశించిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021 సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. లోక్‌సభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ఇవాళ ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఓటరు కార్డుతో ఆధార్‌ను లింక్ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల చట్టాల సవరణ బిల్లును తీసుకువచ్చారు. లోక్‌సభలో ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని మంత్రి రిజిజు తెలిపారు. ఆధార్ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. దేశంలో బోగస్ ఓటింగ్‌ను ఈ చట్టం అంతం చేస్తుందని, ఎన్నికల ప్రక్రియను మరింత విశ్వసనీయంగా మారుస్తుందని అన్నారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. గుర్తింపు కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వ్యక్తుల ఆధార్ నంబర్‌ను కోరేందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను అనుమతించాలని బిల్లు కోరింది. చైర్‌లో ఉన్న రాజేంద్ర అగర్వాల్ మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టేందుకు అంగీకరించారు.
లఖింపూర్ ఖేరీ ఘటనతో సహా పలు అంశాలపై విపక్షాల నిరసనలు కొనసాగుతుండగా, అగర్వాల్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు వారాంతపు విరామం తర్వాత ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు, విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని కోరారు. సభ్యులు విరమించుకునేందుకు నిరాకరించడంతో స్పీకర్ కొన్ని ప్రశ్నలను స్వీకరించి సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.