దేశ ఓటర్లు 2024లో చరిత్రను లిఖించారు: సీఈసీ రాజీవ్‌కుమార్

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  3 Jun 2024 1:45 PM IST
election counting, cec Rajiv kumar, results,

 దేశ ఓటర్లు 2024లో చరిత్రను లిఖించారు: సీఈసీ రాజీవ్‌కుమార్

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఈ మేరకు ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే ఈ సారి ఎన్నికల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకుందని చెప్పారు. ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్‌ ఇచ్చారు ఎన్నికల కమిషన్ సభ్యులు. దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్లు, మహిళలకు తాము సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని రాజీవ్‌ కుమార్ వెల్లడించారు. ఏడు దశల్లో పోలింగ్ విజయవంతంగా జరిగిందని చెప్పారు. రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. 31 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని రాజీవ్‌ కుమార్ అన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలు చారిత్రాత్మక ఎన్నికలు అని..రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. ఏకగా ఇంత మంది ఓటు వేయడం ప్రపంచ రికార్డు సృష్టించిందని చెప్పారు. ఓటు వేసిన వారి సంఖ్య జీ7 దేశాల్లో 1.5 రెట్లు అధికమని, ఈయూఈలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ అని రాజీవ్‌ కుమార్ చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి రీపోలింగ్ తక్కువగా జరిగిందని చెప్పారు. 2024లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందన్నారు. ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేశారని ఆయన అన్నారు. 2019 ఏకంగా 540 చోట్ల రీపోలింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామనీ.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సీఈసీ రాజీవ్‌ కుమార్ చెప్పారు.

Next Story