ఆధార్ కంపల్సరీ కాదు.. ఈసీ కీలక ప్రకటన
దేశంలో లోక్‌సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి.
By Srikanth Gundamalla
ఆధార్ కంపల్సరీ కాదు.. ఈసీ కీలక ప్రకటన
దేశంలో లోక్‌సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈనేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఓటు వేయడానికి ఆధార్ కార్డు కంపల్సరీ అనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదు అని వెల్లడించింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆపబోము అని స్పష్టం చేసింది. ఇక ఓటరు గుర్తు కార్డు లేదా ఏదైనా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.
ఓటర్లకు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలతో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దాంతో.. పలువురు ఎంపీలు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డుల డియాక్టివేషన్‌పై ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. ఈ మేరకు స్పందించిన ఎన్నికల సంఘం టీఎంసీ బృందానికి హామీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదు అని వెల్లడించింది.