నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ
సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 7:53 PM IST
నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ
సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. మనీలాండరింగ్ కేసులో ప్రకాశ్ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.100 కోట్ల పోంజీ స్కీమ్ కేసుకు సంబంధించిన కేసులో విచారణకు తమ ముందు హాజరుకావాలని తాము నోటీసుల్లో ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం నవంబర్ 20వ తేదీన తమిళనాడులోని తిరుచినరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్‌కు చెందిన భాగస్వామ్య సంస్థకు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.
ప్రణవ్ జ్యుయెలర్స్‌కు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఈ సంస్థ పోంజి స్కీమ్ ద్వారా అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అక్టోబరులో ప్రణవ్ జ్యుయెలర్స్ బోర్డు తిప్పేయడంతో ఆ సంస్థ యజమాని మదన్‌పై తమిళనాడులోని ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. నవంబరులో ఆయనపై లుక్‌అవుట్ నోటీసు కూడా జారీ అయింది. చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్ జ్యువెలర్స్ బ్రాంచ్‌లు, యజమానుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మేర మోసం జరిగినట్లు గుర్తించింది. దాంతో.. ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రచారకర్తగా ఉన్న ప్రకాశ్ రాజ్‌కు కూడా విచారించేందుకు ఈడీ సిద్దమైంది. సమన్లు జారీ చేస్తూ.. విచారణకు హాజరుకావాలని పేర్కొంది.