ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పు

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  17 March 2024 12:15 PM GMT
EC, lok sabha election, himachal pradesh, sikkim, assembly ,

 ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పు

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. రెండు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కంపు తేదీలను మార్చింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీలను మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు లోక్‌సభతో పాటే జూన్‌ 4న చేపట్టనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే.. వీటి అసెంబ్లీల గడువు జూన్ 2కే ముగియనుంది. దాంతో.. జూన్ 4న బదులు జూన్ 2నే ఈ రాష్ట్రాల్లో కౌంటింగ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తద్వారా మొత్తం ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ, నేషనల్‌ పీపుల్స్ పార్టీతో పాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కూడిన ఎన్డీయే కూటమి పాలన సాగుతోంది. ఇక సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ, సిక్కిం క్రాంతికారి మోర్చాలతో కూడిన ఎన్డీఏ కూటమే సిక్కింలోనూ అధికారంలో ఉంది. మొదట ఈ రెండు రాష్ట్రాల్లో కూడా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌తో పాటే జూన్‌ 4న జరగాల్సి ఉండగా.. తాజాగా ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను జూన్‌ 2న జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది.





Next Story