విద్యుత్‌షాక్‌తో గాడిద మృతి.. 65 మందిపై కేసు నమోదు

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగింది ఈ విచిత్ర సంఘటన.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2024 2:47 PM IST
విద్యుత్‌షాక్‌తో గాడిద మృతి.. 65 మందిపై కేసు నమోదు

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. బక్సర్ జిల్లాలోని కేసత్‌ బ్లాక్‌లో కరెంట్‌ షాక్‌తో అనుకోకుండా ఓ గాడిద చనిపోయింది. దాంతో.. ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఆందోళనకు దిగారు. విద్యుత్‌ అధికారులు వీరి ఆందోళనలను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన స్థానికులు.. పక్కనే ఉన్న చకోడా పవర్‌ గ్రిడ్‌ స్టేషన్‌కు వెళ్లారు. దాని ముందు బైఠాయించారు. చనిపోయిన గాడిదకు విద్యుత్‌ అధికారులే పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా కొందరు పవర్ గ్రిడ్‌ స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోయేలా చేశారు. నిరసనకారులను విద్యుత్‌ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. కొన్ని గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. చివరకు విద్యుత్‌ అధికారులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారి సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పవర్ గ్రిడ్‌ స్టేషన్‌కు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. అక్కడి నుంచి బయటకు పంపేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో విద్యుత్‌ అధికారులు గ్రామస్తులపై ఫిర్యాదులు చేశారు. పోలీసులు దాదాపు 65 మంది స్థానికులపై కేసులు నమోదు చేశారు. గాడిద మృతి వ్యవహారంపై విద్యుత్ శాఖ అధికారులపైనా కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. పరస్పర ఫిర్యాదులతో ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story