కేరళలో తొమ్మిదేళ్ల పాపపై కుక్కల దాడి.. పాపం చిన్నారి..

తొమ్మిదేళ్ల బాలికపై కుక్కలు దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. జాన్వీ తన ఇంటి ఆవరణలోని పెరట్లో

By Srikanth Gundamalla  Published on  20 Jun 2023 1:31 PM GMT
Dogs Attack 9 Years Girl Kerala

 కేరళలో తొమ్మిదేళ్ల పాపపై కుక్కల దాడి.. పాపం చిన్నారి..

దేశంలో చాలా చోట్ల కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. అభంశుభం ఎరుగని చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో పిల్లలు కొందరు ప్రాణాలు కోల్పోతే.. ఇంకొందరు తీవ్రగాయాల పాలై ఆస్పత్రుల్లో చేరారు. తాజాగా కేరళలో మరో సంఘటన వెలుగు చూసింది. ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని కుక్కలు అతిదారుణంగా కరిచాయి. అక్కడే ఉన్న సిసికెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

కేరళలో కన్నూర్‌లోని ముజప్పిలంగాడ్‌లో జరిగింది ఈ ఘటన. జాన్వి అనే తొమ్మిదేళ్ల బాలికపై కుక్కలు దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.జాన్వీ తన ఇంటి ఆవరణలోని పెరట్లోనే ఆడుకుంటోంది. పక్కన ఎవరూ లేరు. అంతలో మూడు వీధి కుక్కలు పెరట్లోకి వచ్చాయి. చిన్నారి ఆడుకుంటుండగా ఆమెపై దాడి చేశాయి. నేలపై ఈడ్చుకెళ్లి.. జుట్టుని లాగి... కరిచాయి. అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే ప్రాణ భయంతో చిన్నారు కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కుక్కలను తరిమేశారు. ఆ తర్వాత చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో చిన్నారి తల, పొత్తికడుపు, కాళ్లు, చాతిపై లోతైన గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ముజప్పిలంగాడ్‌లో కుక్కలు దాడి చేయడం ఇది రెండో ఘటన. ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి.

Next Story