ఢిల్లీ: 15 రోజుల్లో 872 మరణాలు.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..!
Delhi covid-19 cases I ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో
By సుభాష్ Published on 12 Nov 2020 8:29 PM ISTదేశంలో కరోనా మహమ్మారి కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా ఢిల్లీలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య తీవ్రమవుతోంది. గడిచిన 15 రోజుల్లో 870కిపైగా మరణాలు నమోదు కావడం మరింత కలవర పెడుతోంది. అయితే అకస్మాత్తుగా కేసులు పెరగడానికి గాలిలో నాణ్యత లోపిస్తుందని, ప్రజలు భద్రతా ప్రమాణాలు సైతం పాటించకపోవడం, ఈ నిర్లక్ష్యం కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 28 నుంచి రోజువారీగా ఐదు వేల చొప్పున కొత్త కేసులు నమోదు అవుతున్నప్పటికీ, నిన్న ఒక్క రోజే ఆ సంఖ్య 8వేలకు చేరడం భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో ఢిల్లీలో కేసులు నమోదు కావడం మొదటిసారి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు ఢిల్లీ నగరంలో 90,572 కేసులు, 872 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ద్వారా తెలుస్తోంది. రెండు రోజులుగా 80కిపైగా మరణాలు నమోదు కావడం అక్కడి పరిస్థితులను అద్దం పడుతోంది. బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 85 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో 7228 మంది కరోనాతో మృతి చెందారు.
వైద్య నిపుణులు ఏమంటున్నారు...
కాగా, బుధవారం ఒక్క రోజే 8593 కొత్త కేసులు నమోదు కావడంతో రాజధానిలో పాజిటివ్ కేసుల సంఖ్య 4.59 లక్షలకు చేరింది. ఒక్కసారిగా కేసులు, మరణాలు పెరగడానికి గల కారణాలను వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. పండగ సీజన్ కావడంతో జనం భారీ సంఖ్యలో తిరగడం, రోగుల్లో దీర్ఘకాలిక వైద్యులుండటం, పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తడం, సరైన కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వహించడం వంటి కారణాలతో పాజిటివ్, మరణాల సంఖ్య పెరగడానికి కారణమని చెబుతున్నారు.
మరణించిన వారు 60 నుంచి 70 ఏళ్లకు పైబడిన వారే..
కాగా, ఢిల్లీలో కోవిడ్ బారిన పడి మరణించిన వారు ఎక్కువ శాతం 60 నుంచి 70 ఏళ్లకుపైబడిన వారే ఉన్నట్లు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. చాలా మందిలో దీర్ఘకాలిక రోగ లక్షణాలు ఉన్నవారే ఉన్నారని పేర్కొంటున్నారు. కరోనా రోగుల్లో డయాబెటిస్, బీపీ తదితర వ్యాధులు ఉన్న కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోందని వెల్లడిస్తున్నారు. పండగ సీజన్ ఉన్నందున చాలా మంది షాపింగ్ మాల్స్‌లకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కూడా అసలైన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.