కూతురికి బలవంతంగా కోడిగుడ్డు తినిపించారు.. తండ్రి ఫిర్యాదు
కర్ణాటకలోని శివమొగ్గలో ఓ తండ్రి విద్యాశాఖ అధికారులను ఆశ్రయించాడు.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 9:30 AM ISTకూతురికి బలవంతంగా కోడిగుడ్డు తినిపించారు.. తండ్రి ఫిర్యాదు
కర్ణాటకలోని శివమొగ్గలో ఓ తండ్రి విద్యాశాఖ అధికారులను ఆశ్రయించాడు. తన కూతురు ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోందని.. అక్కడ తన కూతురికి బలవంతంగా కోడిగుడ్లు బలవంతంగా తినిపించారని అధికారులకు ఫిర్యాదు చేశాడు. సదురు తండ్రి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు.. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.
కర్ణాటకలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు కోడిగుడ్లను అందజేస్తుంది. అయితే.. శివమొగ్గలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థినికి బలవంతంగా కోడిగుడ్లు తినిపించారని ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. అలా బలవంతంగా తినిపించి తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపించారు. సదురు తండ్రి ఫిర్యాదు స్థానికంగా కలకలం రేపింది. ఈ చర్యకు పాల్పడిన పాఠశాల ఉపాధ్యాయుడుతో పాటు ప్రధానోపాధ్యాయుడిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు సదురు విద్యార్థిని తండ్రి. తాము శాకాహార డైట్ ఫాలో అవుతామని టీచర్లకు ముందే చెప్పామన్నాడు. అయినా తన కూతురికి బలవంతంగా గుడ్డు తినిపించారని ఆరోపించారు.
అయితే.. ఆ తండ్రి ఆరోపణలను ఉపాధ్యాయులు కొట్టి పారేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. విద్యార్తులంతా వరుసగా బోజనం చేస్తున్న సమయంలో.. సంబంధిత ఉపాధ్యాయుడు గుడ్లు కావాల్సిన విద్యార్థులు చేతులు లేపాలని చెప్పాడు. ఆ క్రమంలోనే మిగిలినవారితో ఆ చిన్నారి కూడా చేయి లేపినట్లుగా కనబడింది. దాంతో ఆమెకు గుడ్డు అందించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అంతేకాని.. ప్రత్యేకంగా కోడిగుడ్డు తినాలని విద్యార్థినిని బలవంతం చేయలేదని అధికారులకు ఉపాధ్యాయులు వెల్లడించారు.
ఇక అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలించి.. ఉల్లంఘనకు పాల్పినట్లు తేలితే సంబంధింత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని శివమొగ్గ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ పరమేశ్వరప్ప చెప్పారు.