అటల్‌ సేతు బ్రిడ్జిపై పగుళ్లు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ విమర్శలు

అటల్ సేతు బ్రిడ్జిపై పగుళ్లు వచ్చిన ఘటన సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla
Published on : 22 Jun 2024 7:34 AM IST

cracks,  atal setu bridge, congress vs bjp,

అటల్‌ సేతు బ్రిడ్జిపై పగుళ్లు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ విమర్శలు 

మహారాష్ట్రలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంతెనను కేంద్రం ప్రారంభించింది. దీనికి అటల్‌ సేతు బ్రిడ్జిగా నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. తాజాగా ఈ బ్రిడ్జిపై పగుళ్లు రావడం రాజకీయపరంగా హీట్‌ను పెంచింది. కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. రాకపోకలు కొనసాగించిన నెలల వ్యవధిలోనే అటల్‌ సేతు వంతెనపై పగుళ్లు ఏర్పడటంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నావా పటోలే ఆరోపణలు చేశారు.

ఈ మేరకు ఆయన అటల్‌ సేతు పగుళ్లు ఏర్పడ్డ ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లి చూపించారు. పగుళ్లు పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అటల్‌ సేతు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. వంతెన నిర్మాణంలో నాణ్యత లేదన్నారు. కాబట్టే పగుళ్లు వచ్చాయని చెప్పారు. పగుళ్లు ఏర్పడ్డ ప్రాంతాన్ని కర్రలతో తడుతూ పరిశీలించారు నావా పటోలే. నిర్మాణం కోసం 18వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.. అంత నిధులు పెట్టి ఇలా నాసిరకంగా నిర్మిస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.

బీజేపీతో పాటు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాత్రం ఈ పగుళ్లు బ్రిడ్జిపైన కాకుండా నవీ ముంబైలోని ఉల్వే రహదారిపై ఏర్పడ్డాయని పేర్కొంది. అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపండి అంటూ బీజేపీ ఎక్స్‌ వేదికగా స్పందించింది. ఆది సర్వీస్‌ రోడ్డు.. ప్రధాన వంతెనకు అనుసంధానించే భాగం అనిపేర్కొంది. ఇవి చిన్న పగుళ్లు మాత్రమే అంటూ చెప్పింది. త్వరలోనే దీన్ని కూడా సరిచేస్తామన్నది. ట్రాఫిక్‌ అంతరాయం కూడా ఏర్పడలేదని అటల్‌ సేతు ప్రాజెక్ట్‌ హెడ్‌ కైలాష్ గణత్ర చెప్పారు.

Next Story