సీతారాం ఏచూరికి సీరియస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలెటర్‌పై చికిత్స
సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 6:59 AM ISTసీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆయన పరిస్థితి బాగోలేదని గుర్తించిన వైద్యులు వెంటనే వెంటిలెటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్‌పైనే ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కాగా.. కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. కాగా.. సీతారాం ఏచూరికి ప్రస్తుతం 72 ఏళ్ల వయసు. కొంతకాలంగా ఆయన ఊపరితిత్తుల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు.
ఆగస్టు 19వ తేదీనే ఢిల్లీలోని ఎమర్జెన్సీ వార్డులో సీతారాం ఏచూరిని కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. తాజాగా గురువారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆయన్ని వెంటిలెటర్‌తో చికిత్స అందిస్తున్నారు. నిత్యం ఒక వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారని సమాచారం. అయితే చికిత్సకు సంబంధించిన వివరాలను హాస్పిటల్ వెల్లడించలేదు. కాగా ఇటీవలే కంటికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు.
ఆగస్టు 31వ తేదీనే సీపీఐ (ఎం) పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనీ.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరినట్లు చెప్పింది. ‘భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.