కొవాగ్జిన్ టీకా వేసుకున్న వారిలో సైడ్‌ఎఫెక్ట్స్.. ICMR ఏమందంటే..
గత కొంతకాలంగా కరోనా టీకాలు తీసుకున్న వారు అనారోగ్యానికి గురవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 May 2024 4:15 PM ISTకొవాగ్జిన్ టీకా వేసుకున్న వారిలో సైడ్‌ఎఫెక్ట్స్.. ICMR ఏమందంటే..
గత కొంతకాలంగా కరోనా టీకాలు తీసుకున్న వారు అనారోగ్యానికి గురవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొవాగ్జిన్ వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలోనూ సైడ్‌ఎఫెక్ట్స్ వస్తున్నాయని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఓ రిపోర్టును విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో దాదాపు 30 శాతం మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వెల్లడించింది. దాంతో.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఐసీఎంఆర్ తాజాగా ఈ వార్తలపై స్పందించింది.
ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ మాట్లాడారు. కొవాగ్జిన్ టీకా వాడకంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. స్టడీ కోసం వాడిన మెథడాలజీ, డిజైన్‌ను ఆయన విమర్శించారు. ప్రచారం జరుగుతున్న ఈ నివేదిక అందరినీ తప్పుదోవ పట్టించేలా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిక, వ్యాక్సిన్ తీసుకోని వారి మధ్య తేడాను వారు చేసిన స్టడీ తేల్చలేదని రాజీవ్ భల్ చెప్పారు. అందుకే కోవిడ్-19 వ్యాక్సినేషన్‌తో ఆ రిపోర్టును అనుసంధానం చేయలేమనీ అన్నారు. అలాగే కొవాగ్జిన్ టీకా వేసుకున్న వారిలో సైడ్‌ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పడానికి లేదన్నారు.
అలాగే ఈ స్టడీ కోసం బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఎలాంటి ఆర్థిక సాయం తాము చేయలేదన్నారు. సాంకేతికంగా కూడా ఎలాంటి హెల్ప్ అందించలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ మేరకు కొవాగ్జిన్ వేసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని రిపోర్ట్ ఇచ్చిన వారికి లేఖ రాశామని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ భల్ చెప్పారు. ఐసీఎంఆర్ నివేదిక ఇచ్చాకే తాము ఈ విషయాన్ని గుర్తించామని చెప్పినట్లుగా ఇచ్చిన ప్రకటనను తొలగించాలని లేఖలో పేర్కొన్నట్లు రాజీవ్ భల్ అన్నారు.