పల్లెల్లో కరోనా పంజా.. గ్రామాలు మహమ్మారిని ఓడించేనా..!
Corona virus paw in the village. రాష్ట్రంలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 9 May 2021 4:08 PM IST
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే.. పట్టణాల్లో ఓ మోసార్తుగా చికిత్స అందుతున్నా.. మారుమూల పల్లెల్లో పరిస్థితి అధ్వానంగా తయారవుతోంది. రాష్ట్రంలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో నెలరోజుల్లో 20 మంది మరణించగా.. 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాత మద్దిపడలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా.. ఏడుగురు మరణించారు.
మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎంతో దారుణంగా ఉంది. మొదటి వేవ్ లో ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళలేదు. పల్లెలు ఎంతో ధైర్యంగా మొదటి వేవ్ కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పల్లెల్లోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. పల్లెల్లో కరోనా గురించి అవగాహన కూడా కాస్త తక్కువగా ఉండడం కూడా కరోనా కేసులు పెరగడానికి కారణం అవుతూ ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువ అవ్వడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా గ్రామాల్లో టెస్టులు చేయించుకునే వాళ్ళు కూడా తక్కువ కావడంతో తమకు ఉన్నది కరోనానో.. కాదో కూడా తెలుసుకోలేకపోతుంటారు.
మొదటి వేవ్ సమయంలో కరోనా మహమ్మారి పల్లెలను తాకడానికి నాలుగు నెలల సమయం పట్టగా.. సెకండ్ వేవ్ లో కేవలం నెలరోజుల్లోనే పల్లెల్లో కరోనా మహమ్మారి తిష్ట వేసింది. మొదటి వేవ్ కు, సెకండ్ వేవ్ కు మధ్య సంవత్సరం గ్యాప్ ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం కూడా పెద్ద మైనస్ గా పరిగణించవచ్చు. చాలా వరకూ నాయకులు దేశంలోని పెద్ద పెద్ద నగరాలపై దృష్టి పెట్టారు కానీ.. దేశంలోని ఆరు లక్షల గ్రామాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం చాలా అరుదు. అయితే ఆశా వర్కర్లకు కనీసం పీపీఈ కిట్లు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో గ్రామాలు కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొంటాయో అనే అంశం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తూ ఉంది. ప్రభుత్వానికి సెకండ్ వేవ్ విషయంలో పోరాడడానికి సంవత్సరం సమయం ఉన్నప్పటికీ సదుపాయాలను మెరుగు పరచకుండా ఏడాది పాటూ నిద్రపోయిందని విమర్శలు తీవ్రంగా వస్తూ ఉన్నాయి.