అమూల్ వివాదం.. మొన్న కర్ణాటక.. నేడు తమిళనాడు
గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ పై కర్ణాటకలో ఎంత వివాదం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By M.S.R Published on 25 May 2023 7:45 PM IST
అమూల్ వివాదం.. మొన్న కర్ణాటక.. నేడు తమిళనాడు
గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ పై కర్ణాటకలో ఎంత వివాదం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తమిళనాడులో అమూల్ విషయంలో వివాదం మొదలైంది. తమిళనాడులో అమూల్ పట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రం జోక్యం కోరుతూ హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తక్షణమే తమిళనాడు నుంచి అమూల్ (ఆనంద్ మిల్క్ లిమిటెడ్/గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్) పాలు సేకరించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడులో పాడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అమూల్ తరఫున కైరా డిస్ట్రిక్ట్ కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ పాలు సేకరిస్తుంది.
అమూల్ తనకున్న మల్టీ స్టేట్ కోపరేటివ్ లైసెన్స్ ఆధారంగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో పాల ప్రాసెసింగ్, చిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు స్టాలిన్ తెలిపారు. కృష్ణగిరి, ధర్మపురి, వెల్లోర్, రాణీపేట్, తిరుపత్తూర్, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల్లో అమూల్ పాలు సేకరించనుందని.. ఇది చాలా తప్పు అని ఆయన చెప్పుకొచ్చారు. కోపరేటివ్ సంస్థలు వేటికవే వాటి పరిధిలో పాల సేకరణకు పరిమితం కావాలన్నది నిబంధన అని, ఇలా ఇతర ప్రాంతాల్లో పాల సేకరణ అన్నది క్షీర విప్లవ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో పాలకు కొరత ఏర్పడుతుందని.. వెంటనే జోక్యం చేసుకుని తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్ ను నిరోధించాలని స్టాలిన్ కోరారు.