సీఎం మమతాబెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్లు.
By Srikanth Gundamalla
సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
వాతావరణం అనుకూలించనప్పుడు హెలికాప్టర్‌లో ప్రయాణం ప్రమాదకరం. వర్షాలు.. భారీగా ఈదురుగాలులు వీచినప్పుడు హెలికాప్టర్‌ను నడపలేరు. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్లు. ఉత్తర బెంగాల్ సిలిగుఢిలోని సెవోక్ ఎయిర్‌బేస్‌లో ఈ ఘటన జరిగింది.
జల్‌పాగుఢీ జిల్లా కేంద్రంతో పాటు అక్కడి క్రాంతీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఆ తర్వాత మరో సభలో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి బయల్దేరారు. ఆమె హెలికాప్టర్ ఎక్కిన తర్వాత ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో.. సభా ప్రాంగణం వరకు హెలికాప్టర్‌ను తీసుకెళ్లలేమని పైలట్లు భావించారు. అలా ముందుకు వెళ్తే ప్రమాదమని గుర్తించి ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాలని భావించారు. దీంతో.. సిలిగుఢిలోని సెవోక్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ చేశారు. అయితే.. సీఎం మమతా బెనర్జీ క్షేమంగా ఉన్నారని.. ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు అధికారులు.
హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత.. మమతా బెనర్జీ రోడ్డు మార్గంలో బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కోల్‌కతా బయల్దేరి వెళ్లారని అధికారులు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సీఎం మమత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.