లాకప్ నుంచే సీఎం కేజ్రీవాల్ రెండో ఉత్తర్వులు.. ఈడీ సీరియస్!
తాజాగా ఈడీ లాకప్ నుంచి సీఎం కేజ్రీవాల్ రెండోసారి ఉత్తర్వులను జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 March 2024 1:09 PM ISTలాకప్ నుంచే సీఎం కేజ్రీవాల్ రెండో ఉత్తర్వులు.. ఈడీ సీరియస్!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అయితే.. అరెస్ట్ అయిన తర్వాత సీఎం బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారని అనుకున్నారు కానీ.. ఆయన అలా చేయలేదు. లాకప్ నుంచే పాలన సాగిస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే ఈడీ కస్టడీ నుంచి ఇప్పటికే ఒకసారి ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ఈడీ లాకప్ నుంచి సీఎం కేజ్రీవాల్ రెండోసారి ఉత్తర్వులను జారీ చేశారు. లాకప్ నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై ఈడీ సీరియస్ అవుతోంది.
మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు అని మంత్రి సౌరభ్ తెలిపారు.
ఇక ఇటీవల సీఎం కేజ్రీవాల్ మొదటి ఉత్తర్వులు ఇచ్చారు. మొదటి ఉత్తర్వుల్లో నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్, కాగితాలను తాము సమకూర్చలేదని ఈడీ చెబుతోంది. మరి ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇదే విషయంలో మంత్రి ఆతిశీని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.