సీరియల్ సెట్స్‌లోకి చిరుత ఎంట్రీ, పరుగు తీసిన సిబ్బంది

ఫిల్మ్‌ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లోకి పిల్లలతో సహా చిరుతపులి ప్రవేశించింది.

By Srikanth Gundamalla  Published on  27 July 2023 5:13 AM GMT
Cheetah Entry, Serial, Shoot Set, Mumbai,

సీరియల్ సెట్స్‌లోకి చిరుత ఎంట్రీ, పరుగు తీసిన సిబ్బంది

అడవుల్లో తిరగాల్సిన జంతువులు ఈ మధ్య కాలంలో జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల క్రూర మృగాలు పశువులు, మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఇంకొన్ని చోట్ల అయితే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సీరియస్‌ షూటింగ్‌ సెట్స్‌లోకి చిరుత ఎంట్రీ ఇచ్చింది. దాంతో.. సీరియల్ షూటింగ్‌ సిబ్బంది అంతా ఒక్కసారిగా భయపడిపోయారు. అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబైలో జరిగింది ఈ ఘటన. ఫిల్మ్‌ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లోకి పిల్లలతో సహా చిరుతపులి ప్రవేశించింది. గోరేగావ్‌ ఫిల్మ్‌ సిటీలో టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. దాదాపు 200 మంది సిబ్బంది సెట్‌లోనే ఉన్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న సమయంలో.. సడెన్‌గా చిరుత పులి ఎంట్రీ ఇచ్చింది. దాంతో.. వారంతా హడలిపోయారు. ఎక్కడ దాడి చేస్తుందేమో అన్న భయంతో నటులతో పాటు టెక్నీషియన్స్, సిబ్బంది సెట్‌ నుంచి బయటకు పరుగు తీశారు. చిరుతపులి దర్జాగా సెట్స్‌లో తిరుగుతుండగా.. సిబ్బంది భయంతో పరుగులు తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దీనిపై ఆల్‌ ఇండియన్ సినీ వర్కర్స్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా మాట్లాడారు. గత పదిరోజుల్లో ఈ తరహా ఘటన జరగడం నాలుగోసారి అని గుర్తు చేశారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తరచూ పులులు రావడం వల్ల షూటింగ్స్‌ ఆగిపోతున్నాయని, లక్షల్లో నష్టం వాటిల్లుతోందని చెప్పారు. అంతేకాక పులల వల్ల ప్రాణాపాయం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని చేసేందుకు కూడా టెక్నీషియన్స్‌, ఇతర సిబ్బంది ముందుకు రావడం లేదని సురేశ్ శ్యామ్‌లాల్‌ పాల్ చెప్పారు.

Next Story