వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం..సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.

By Srikanth Gundamalla  Published on  3 Oct 2024 9:15 PM IST
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం..సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దీన్ని నేరంగా పరిగణించడం సుప్రీంకోర్టు పరిధిలో లేదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే తగినన్ని శిక్షలు ఉన్నాయని, కానీ ఇది మాత్రం చట్టబద్దమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని పేర్కొంది. వైవాహిక అత్యాచారం అనేది చట్టపరమైనదాని కంటే సమాజానికి సంబంధించిన సమస్య అని, ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ దాఖలు చేసింది. అన్ని పక్షాలతో సంప్రదింపులు లేకుండా, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలనుపరిగణలోకి తీసుకోకుండా సరైన నిర్ణయానికి రాలేమని తెలిపింది. అయితే ప్రతీ వివాహం మహిళ సమ్మతితో జరగడం లేదని విషయాన్ని కేంద్రం అంగీకరించింది. కానీ వివాహంలో జరిగే ఇలాంటి ఉల్లంఘన పరిణామాలు, బయట జరిగే ఉల్లంఘనలకు తేడా ఉంటుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వివాహ జీవితంలో భాగస్వాఇ నుంచి శారీరక సంబంధాన్ని కోరుకోవడం సహజమని వ్యాఖ్యానించింది. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను లైంగిక సంబంధానికి ఒత్తిడి చేసే హక్కు భర్తకు లేదని కేంద్రం పేర్కొంది. వివాహితలపై క్రూరత్వానికి పాల్పడే వారిని శిక్షించే చట్టాలు ఉన్నాయని తెలిపింది.

Next Story